యూకేజీ విద్యార్థినిపై పీఈటీ టీచర్ లైంగిక వేధింపులు…
కామారెడ్డిలో ప్రైవేటు స్కూల్ వద్ద ఉద్రిక్తత?
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవదాన్ స్కూల్ వద్ద ఈరోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూకేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ అనే ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిని రూమ్‌లో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై చిన్నారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పేరెంట్స్ స్కూల్‌కు వెళ్లి పాఠశాల సిబ్బందిని నిలదీశారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో పీఈటీ టీచర్ నాగరాజుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి. స్కూల్‌పై రాళ్ల దాడి చేయడంతో పాటు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు.
కామారెడ్డిలో హై టెన్షన్.. పోలీసులపై రాళ్లు, సీఐ తలకు గాయం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలో..
పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అయితే.. ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటి నాగరాజును కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. స్కూల్ గుర్తింపు రద్దు కోరుతూ ముట్టడించారు. ఉదయం నుంచి ఐదు గంటలుగా కామారెడ్డిలో ఆందోళన కొనసాగుతుంది.