ఏసీబీ వలలో స్కూల్ ప్రిన్సిపల్.. అనాథ పిల్లలతో అసభ్యంగా..
ఆయన అవినీతి ప్రిన్సిపల్ మాత్రమే కాదు ఓ కీచకుడు కూడా. అడ్డగోలుగా లంచాలు తీసుకుంటూ.. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నీచుడి బాగోతం ఎట్టకేలకు బయటపడింది.
ఈ మేరకు ఫుడ్ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటూ సరూర్ నగర్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఏసీబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఫుడ్ కాంట్రాక్ట్ లో అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో ప్రభుదాస్పై నిఘా పెట్టిన ఏసీబీ.. కాంట్రాక్టర్ నుంచి రూ.29 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది.
అనాథ ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన..
ఈ క్రమంలోనే ఉప్పల్లోని ప్రభుదాస్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆయన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపింది.
ఇదిలా ఉంటే.. ప్రభుదాస్ అమ్మాయిలపట్ల అరాచకంగా వ్యవహరించినట్లు బయటపడింది. తన స్కూల్లో ఉండే అనాథ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
స్కూల్ టెండర్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. పాఠశాల నిధులను కూడా పక్కదారి పట్టించి భారీగా డబ్బు దండుకున్నాడని పలువరు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.