ఆర్‌ఎంపీ డాక్టర్ భార్య దారుణ హత్య…
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్‌ఎంపీ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురైంది. ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
ఎల్లారెడ్డి గూడ నవోదయకాలనీలో నివాసం ఉండే ఉమామహేశ్వరరావు ఆర్ఎంపీ వైద్యుడు. ఎల్లారెడ్డిగూడెం దేవాలయం పక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ చేస్తున్నాడు.
నవోదయ కాలనీలోని ప్లాట్ నెంబర్ 36లో రెండవ అంతస్తుల భవనంలో భార్య సుధారాణి(44), కుమార్తె రుద్రా రాణి, కుమారుడు శ్రీకర్ చంద్రతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చి పక్క వీధిలో ట్యూషన్‌కి వెళ్లారు. భర్త ఉమామహేశ్వర రావు క్లినిక్‌కు వెళ్ళాడు.
ట్యూషన్‌కు వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చేసరికి సుధారాణి రక్తపుమడుగులో పడి ఉంది. వెంటనే పక్క ఫ్లాట్ వాళ్లకు చెప్పారు. అనంతరం తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా సుధారాణి అప్పటికే మరణించి ఉంది.
కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీస్ జాగిలాలను, క్లూస్ టీం ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ తగాదాలు ఇతర అంశాలపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు