సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం.. దంపతుల ఆత్మహత్య
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించడంతో ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటుచేసుకుంది.
సాయిరాం తండాకు చెందిన హలావత్ రత్న కుమార్, పార్వతిలకు సింగరేణిలో ఉద్యోగాలను ఇప్పిస్తామని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆశలు కల్పించాడు. దీంతో అప్పులు చేసి పదహారు లక్షల రూపాయలు చెల్లించారు.
అయితే ఉద్యోగాలు రాకపోవడంతో పాటుగా అప్పులు పెరిగిపోవడం, వడ్డీలు కూడా కట్టలేకపోవడంతో వడ్డీలు ఇచ్చిన వారి వద్ద నుంచి ఒత్తిళ్లు రావడంతో ఇద్దరు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.