
ప్రైవేట్ ఆస్పత్రులు రూల్స్ పాటించకుంటే చర్యలు తప్పవు
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లతో ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వైద్యరంగానికి సంబంధించి చట్టాల పట్ల ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు అవగాహన ఉండాలన్నారు.
హెచ్ఎంఎస్, వైద్య ఖర్చుల నియంత్రణ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఎంటీపీ యాక్ట్, ఐవీఎఫ్, సరోగసి నియమాలు పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో చట్టాలపై ట్రైనర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
ప్రైవేట్ ఆస్పత్రులు వంద శాతం క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వైద్య సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలు, ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు.
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్లో అవకతకవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకే చికిత్సకు సీఎం రిలిఫ్ ఫండ్, ఆరోగ్య శ్రీ రెండు చోట్ల క్లెయిమ్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ పద్ధతిని వెంటనే మార్చుకోవాలన్నారు.
ఫర్టిలిటీ సెంటర్, ఐవీఎఫ్ క్లినిక్, జెనెటిక్ కౌన్సిలింగ్, నర్సింగ్ హోమ్, డయాగ్నొస్టిక్, స్పీచ్ థెరపీ లాంటి అనేక రకాల ఆస్పత్రులు వస్తున్నాయని, వీటికి పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు.
ఆస్పత్రుల్లో తప్పనిసరిగా పార్కింగ్ సౌకర్యం, అగ్ని ప్రమాదాల నివారణకు వాహనాలు వచ్చేలా ఫైర్ క్లియరెన్స్ ఉండాలన్నారు.ఆరోగ్యకరమైన ఖమ్మం జిల్లాను తయారు చేయడంలో ప్రైవేట్ ఆస్పత్రులు తమ సహకారం అందించాలని కోరారు.
ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి నారాయణ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుపై హై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిని మున్సిపాలిటీల్లో అమలు అయ్యేలా చూడాలన్నారు. డీఎంహెచ్వో బి.కళావతి బాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.