భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులే..
డీఎస్పీ ఫలితాల్లో భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన దంపతులు రాంపల్లి శ్రావణ్ కుమార్, చైతన్య ఎస్జీటీలుగా ఎంపికయ్యారు.
వీరికి 2021లో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చైతన్యది మండలంలోని తాళ్లఊకల్ గ్రామం కాగా.. పక్క గ్రామం తానంచర్ల హైస్కూల్లో 2012లో పదో తరగతి పూర్తి చేశారు. ఖమ్మంలో ఇంటర్, మరిపెడలో డిగ్రీ, ఖమ్మంలోని సెయింట్ లారెన్స్ కాలేజీలో టీటీసీ పూర్తి చేశారు.
ఈక్రమంలో ఆమె 2020లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికై నర్సింహులపేట పోలీస్ స్టేషన్లో మొదటి పోస్టింగ్ చేపట్టారు. అనంతరం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే డీఎస్సీకి ప్రిపేరై ఎస్జీటీ ఉద్యోగం సాధించారు.
భర్త రాంపల్లి శ్రావణ్ కుమార్ స్వగ్రామం రాంపురం ప్రభుత్వ పాఠశాలలో 2011లో ఎస్సెస్సీ పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ మరిపెడలో, టీటీసీ ఖమ్మంలోని సెయింట్ లారెన్స్ కాలేజీలో పూర్తి చేశారు. దంపతులలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికవడంపై గ్రామస్తులు, బంధువులు అభినందించారు.