‘కస్తూర్బా’ విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్ కస్తూర్బా విద్యాలయంలో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో 11 మంది బాలికలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
విద్యార్థులు తీవ్రమైన దగ్గుతో అస్వస్థతకు గురి కావడాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది.. 108 వాహనంలో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇటీవల నిర్మాణ పనులు చేపట్టడంతోపాటు గోడలకు రంగులు వేశారని, ఆ వాసనలకు విద్యార్థులకు దగ్గు, శ్వాస సమస్యలకు కారణమై ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు.
ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని, మరో ముగ్గురికి దగ్గు తగ్గకపోవడంతో ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.