సబ్ రిజిస్ట్రార్ కు ‘అసైన్డ్’ రిజిస్ట్రేషన్ హక్కు లేదు…
విచారణ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే హక్కు సబ్ రిజిస్ట్రార్ కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ అంశంపై పూర్తి విచారణ చేపట్టి..
నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, మంచిర్యాల కలెక్టర్, ఆర్డీవో, కాసిపేట్ తహసీల్దార్, మంచిర్యాల, లక్సెట్టిపేట్ సబ్ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాల ని పేర్కొంది. అలాగే అనధికారిక ప్రతివాదులు బ్రహ్మారావు, సత్యనారాయణ రావుకు వ్యక్తిగత నోటీసు లిచ్చింది. తదుపరి విచారణ నవంబర్ 22 కు వాయిదా వేసింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలం పెద్దనపల్లి సర్వే నంబర్ 5/33లోని 8 ఎకరాల వ్యవసాయ భూమిని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ హైకోర్టులో ఎస్.పద్మ పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు గత ఉత్తర్వుల మేరకు తన తాత ముత్యాలుకు అసైన్డ్ చేసిన భూమి తనకు బదలాయించాలని, అయితే అధికారులు మరొకరి పేరుపై సేల్ డీడ్ ఇచ్చారని తెలిపారు.
చట్టానికి విరుద్ధంగా సబ్ రిజిస్ట్రార్ చర్యలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 18న తాను ఇచ్చిన వినతిపత్రంపై విచారణ చేపట్టేలా కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ 8 ఎకరాలపై ఎలాంటి రిజిస్ట్రేషన్ ను అనుమతించ వద్దని మంచిర్యాల, లక్సెట్టిపేట్ సబ్జెజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు.