చెయ్యి విరిగిందని వస్తే ప్రాణం తీస్తారా..!
చెయ్యి విరిగిందని ప్రైవేటు ఆస్పత్రికి వస్తే వైద్యుడి నిర్లక్ష్యం వల్ల యువకుడు మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగిన ఘటన సోమవారం హనుమకొండ జిల్లా, బాలసముద్రం సమీపంలోని ప్రమోద హాస్పిటల్ వద్ద చోటుచేసుకుంది.
మృతుని బంధువుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా, రామచంద్రునిపేటకు చెందిన పి శ్రీకాంత్ చెయ్యి మణికట్టు విరగడంతో ప్రమోద హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సదుపాయం ఉందని గత నెల 27న అడ్మిట్ అయ్యాడు.
ఆరోగ్యశ్రీ ఓపి తీసుకొని ఆర్థోపెడిక్ డాక్టర్ రాకేష్‌ను సంప్రదించగా మణికట్టు ఎముక విరిగిందని అడ్మిట్ కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసుకొని గత నాలుగు రోజుల నుండి బ్లడ్ తక్కువగా ఉందని చికిత్స అందిస్తూ రెండు బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించి ఆరోగ్యంగా
ఉన్న పేషెంట్‌ను ఒక్కసారిగా పరిస్థితి విషమంగా ఉందని శ్రీచక్ర అనే మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి పేషంట్ పరిస్థితి సీరియస్‌గా ఉందని హైదరాబాద్‌కు తీసుకువెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు.
చెయ్యి విరిగిందని నడుచుకుంటూ ఆరోగ్యంగా ఆక్టివ్ గా వచ్చిన వ్యక్తిని ప్రమోద్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో శ్రీకాంత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు.
సంబంధిత ఆసుపత్రిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితునికి జరిగిన చికిత్సపై ఆరోగ్యశ్రీ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
రక్తహీనత సమస్యతో సీరియస్ : ప్రమోద ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ వెంకటరామిరెడ్డి
శ్రీకాంత్ అనే పేషెంట్ చెయ్యి విరిగి ఆర్థోపెడిక్ సమస్యతో నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చారని ప్రమోద ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపారు.
రక్తపరీక్షలో అతనికి హిమోగ్లోబిన్ 6.5 ఉందని, రక్తహీనత సమస్య ఉన్నందున ఆపరేషన్ చేయలేదని, హిమోగ్లోబిన్ పెరుగుదలకు రెండు బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించామని అన్నారు. ఈ క్రమంలో శ్వాసకోశ సమస్యల రావడంతో వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా పేషంట్ కుటుంబ సభ్యులకు తెలియజేశామని తెలిపారు.