KhammamPoliticalTelangana

పోషణే ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే రాందాస్ నాయక్

పోషణే ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే రాందాస్ నాయక్

పోషణే ఆరోగ్యానికి పునాది

పోషకాహారంతో ఆరోగ్యకర భవిష్యత్

ఏన్కూరులో సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం

పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్‌ 24 2026: పోషకాహారం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు 9వ పోషణ మాసం కార్యక్రమాలను ఏన్కూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఏన్కూరు రైతు వేదికలో కామేపల్లి ప్రాజెక్టు పరిధిలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామదాసు నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమానికి హాజరైన గర్భిణీ మహిళలకు ఏన్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్ చీరలను అందజేశారు.
తదుపరి ఎమ్మెల్యే రామదాసు నాయక్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అక్షింతలతో గర్భిణులను ఆశీర్వదించి, తల్లి మరియు శిశువు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి ఆశీర్వదించారు.
అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న చిన్నారులను ప్రోత్సహించే ఉద్దేశంతో వారికి స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా హాజరై పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.
పౌష్టికాహార స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోషణ మాసం సందర్భంగా ఏన్కూరు మండలంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 500 రకాల పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. స్టాళ్లను ఎమ్మెల్యే రామదాసు నాయక్, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలను ఎమ్మెల్యే రుచి చూసి వాటి తయారీ, పోషక విలువల గురించి అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం, పోషక పదార్థాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారాన్ని ప్రతి కుటుంబంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోషకాహార వినియోగం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.
అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రామదాసు నాయక్ చేతుల మీదుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఏ. ప్రమీల రాణి, కామేపల్లి సీడీపీఓ ఉమా, ఎంపీడీఓ భాగ్యశ్రీ, తహసీల్దార్ సీహెచ్ శేషగిరిరావు, సూపర్‌వైజర్లు భవాని, బక్కమ్మ, ఏన్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్, కాంగ్రెస్ నాయకులు మేడ ధర్మారావు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సామేలు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది, గర్భిణులు, చిన్నారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button