రోడ్డుపై అఘోరీ హల్చల్..పోలీసులపై దాడి!
మంగళగిరి రహదారిపై లేడీ అఘోరీ హల్చల్ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గరలో హైవేపై బైఠాయించింది.
తను పవన్ కళ్యాణ్ ను కలవాలని, ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడ నుండి వెళతానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది. ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని చెప్పింది.
పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ నినాదాలు చేసింది. అఘోరీ నిరసనతో గుంటూరు విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్ పై కర్రతో దాడి చేసి అతడిని గాయపరిచింది. అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిన పోలీసుల పైనా దాడికి యత్నించింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
అఘోరీ తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది అవుతోందని మండిపడుతున్నారు. కావాలంటే జనసేన కార్యాలయం ముందు ధర్నా చేసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అఘోరీ ప్రతిరోజు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. తన కారులో తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవల ఏపీలోని ఓ ఆలయం వద్ద ఆత్మహత్యకు యత్నించింది.
ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణం చేసుంటానని ప్రకటించి సంచలనం రేపింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లా నెన్నెలలోని తమ స్వగృహానికి తరలించి నిర్బందించారు. అనంతరం పోలీసులు మహారాష్ట్ర బార్డర్ దాటించి మళ్లీ కొద్దిరోజుల వరకు తెలంగాణలో కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీలో దర్శనం ఇచ్చింది. ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచరిస్తూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. పోలీసులకు సైతం ఆమెను ఆపడం సవాలుగా మారింది. ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడంతో ఏమీ చేయలేకపోతున్నారు.