
పండుగ పూట విషాదం.. బ్రిడ్జిపై బతుకమ్మ ట్రాక్టర్ పల్టీ, ఒకరు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ నిమజ్జనం కోసం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై అదుపు తప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రంగా గాయపడినట్లు, ఇంకా కొంతమందికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బూర్గంపాడు గ్రామానికి చెందిన భక్తులు ట్రాక్టర్ ట్రాలీలో బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో బ్రిడ్జిపై ట్రాక్టర్ అదుపు తప్పడం వల్ల ఒక్కసారిగా పల్టీ కొట్టి కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో బూర్గంపాడు గ్రామానికి చెందిన తోకల రమణయ్య మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.