గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)ఉద్యోగాల ఎంపికలో తెలంగాణ అభ్యర్థులకు న్యాయం చేయాలి
పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ల కారణంగా..
ఎంపికల్లో అన్యాయం జరుగుతోంది
మా తెలంగాణ వారికి దక్కాల్సిన పోస్టులు..
ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయి..
పున: పరిశీలన చేయాలని
ఢిల్లీలో పోస్టల్ శాఖ కార్యదర్శి కి విన్నవించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం: తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టల్ శాఖ ఉద్యోగాలకు 95శాతo తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో పోస్టల్ శాఖ కార్యదర్శి వందిత కౌల్ కు బుధవారం ఢిల్లీలోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పదవ తరగతిలో గ్రేడ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు.
తెలంగాణ (సర్కిల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి.. అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు.
స్థానికంగా తెలుగు చదివినవారు అర్హులని, గ్రేడింగ్ విధానం వల్ల తపాలా శాఖ ఎంపికల్లో.. తెలంగాణ వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని తెలిపారు. పదో తరగతిలో గ్రేడింగ్ కాకుండా.. మార్కులు ఇస్తున్న ఇతర రాష్ట్రాల వారికి ఆ పోస్టులు దక్కుతున్నాయని, గత ఎంపికల్లో ఇలానే జరిగిందని వివరించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో.. 747 మంది తెలంగానేతరులు ఎంపికయ్యారని తెలిపారు. పున: పరిశీలన చేసి.. మా తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ 95శాతం తపాల శాఖలో ఉద్యోగ అవకాశాలు లభించేలా చూడాలని ఈ సందర్భంగా విన్నవించారు.