విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు..
దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు…
విద్యాబుద్దులు నేర్పి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ టీచర్ దారి తప్పాడు. వక్ర బుద్దితో కూతురు వయసున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని తమదైన స్టైల్‌లో నడిరోడ్డుపై చెప్పులతో చితకబాది బడిత పూజ చేశారు.
పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి కీచకంగా ప్రవర్తిస్తావా అంటూ వీపు విమానం మోత మోగించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటకొచ్చాయి.
విద్యార్థులనే కాదు తోటి ఉపాధ్యాయురాళ్లతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచకంగా ప్రవర్తించాడని తేలింది. అంతే వెంటనే సస్పెన్షన్ వేటువేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి ప్రకటన విడుదల చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తున్న సత్యనారాయణను విద్యార్థిని తల్లిదండ్రులు చితకబాదారు.
అదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని రోడ్డు మీద చెప్పులతో బాలిక తల్లిదండ్రులు బడిత పూజ చేశారు. కన్న కూతురు వయస్సున్న ఆడబిడ్డతో వ్యవహరించే తీరు ఇదా అంటూ వీపు విమానం మోత మోగించారు.
స్కూలుకు వెళ్లి నిలదీసే సమయంలో గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన సత్యనారాయణను నడిరోడ్డులో దొరక బట్టుకుని ఎడాపెడా చెప్పులతో విద్యార్థిని తల్లిదండ్రులు చెంపలు వాయించారు.
ఈ దాడి ఘటన వీడియోలను అక్కడి స్థానికులు తమ సెల్ ఫోన్లలలో రికార్డ్ చేసి సోషల్ మీడయాలో వైరల్ చేయడంతో ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య వివరాలు సేకరించారు..
తోటి ఉపాధ్యాయులను ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనతో పాటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయురాళ్ల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించే వాడని తేలింది. దీంతో కీచక ఉపాధ్యాయుడైన సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో యాదయ్య ప్రకటించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో లోతుగా విచారణ జరుపుతామని.. పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తామని డీఈవో యాదయ్య తెలిపారు అంటూ సమాచారం. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.