HealthKhammamPoliticalTelangana

మత్తు పదార్థాలతో భవిష్యత్తు చిత్తు : లివిన్ స్టన్

మత్తు పదార్థాలతో భవిష్యత్తు చిత్తు : లివిన్ స్టన్

మత్తు పదార్థాలతో భవిష్యత్తు చిత్తు

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ముప్పులలో మత్తు పదార్థాల వ్యసనం అత్యంత ప్రమాదకరమైనది.ఇది కేవలం వ్యక్తిని మాత్రమే కాకుండా,కుటుంబాన్ని, సమాజాన్ని,దేశాన్ని కూడా అస్థిరతవైపు నడిపించే శక్తి కలిగిన మానవ వ్యతిరేక సంక్షోభం.

మానవుని శరీరాన్ని హరించి మనసుని మసిచేసి ఆశలను ఆశయాలను నాశనం చేస్తుంది.ముఖ్యంగా యువత ఈ మాయాజాలంలో పడిపోయి వాస్తవికత నుంచి తప్పించి తాత్కాలిక మత్తుకు బానిసలవుతున్నారు.

ఈ తరుణంలో యాంటీ డ్రగ్స్ ఉద్యమం ఆవశ్యకతను అత్యంత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మాదక ద్రవ్య వ్యసనాన్ని నియంత్రించడానికి ప్రభుత్వంతోపాటు,పౌరులు, ప్రజలు,విద్యాసంస్థలు, ఎన్జీవోలు,తల్లిదండ్రులు కలిసి సమిష్టిగా పని చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.

డ్రగ్స్ శరీరంపై మనసుపై ప్రభావం చూపే రసాయనిక పదార్థాలు ఇవి వైద్య విభాగంలో సరైన మోతాదులో ఉపయోగిస్తే ప్రయోజనం.అధిక మోతాదులోనూ లేదా అనవసరంగా వాడితే శారీరక,మానసిక,సామాజిక విధ్వంసానికి దారితీస్తాయి.

ముఖ్యంగా యువత ఉత్సాహం పేరుతోనో,మిత్రులు ఒత్తిడితోనో, ఆత్మవిశ్వాస లోపం,కుటుంబ సమస్యలు,సామాజిక మీడియా ప్రభావం వంటి పలు కారణాలతో సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారి సంక్షోభంలోకి నెట్టివేసి చావు వరకు తీసుకెళ్తాయి.

డ్రగ్స్ వాడటం వల్ల శక్తిహీనంగా అనిపించడం,ఆకలి తగ్గడం, రక్తపోటు పెరగడం,కిడ్నీలు,కాలేయం దెబ్బతినడం,నిద్రలేమి వంటి శారీరక సమస్యలు,ఆత్మవిశ్వాస లోపం,అధిక ఒత్తిడి, గందరగోళం,డిప్రెషన్ ఆత్మహత్య చేసుకోవాలనే మానసిక సమస్యలకు,చదువు పట్ల ఆసక్తి తగ్గిపోవడం, మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి బుద్ధి మాంద్య సమస్యలకు, తల్లిదండ్రులు స్నేహితులతో సంబంధాలు తెగిపోవడం, ఒంటరితనానికి గురవటం,నేర ప్రవర్తనలోకి జారిపోవడం వంటి సామాజిక సమస్యలకు,డ్రగ్స్ కోసం అధిక ఖర్చు వల్ల కుటుంబ ఆర్దిక స్థితి దెబ్బ తినడం,పని సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఉపాధి కోల్పోవడం వంటి ఆర్థిక ప్రభావాలకు గురై,మంచి చెడు మధ్య తేడా గుర్తించలేకపోవడం జీవిత విలువలు మర్చిపోవడం తప్పుదారిలో నడవడం వంటి దుష్ప్రభావాలకు దారి తీసే ఆస్కారం ఉంది.
డ్రగ్స్ బారిన పడకుండా అవి లభించే ప్రదేశాలకు వ్యక్తులకు దూరంగా ఉండాలి.సానుకూల ఆలోచనలు కలిగిన మిత్రులతో సమయం గడపాలి.

వ్యాయామం, ధ్యానం,సంగీతం,పఠనం, చిత్రకళ,కవిత్వం వంటి ఏదో ఒక సృజనాత్మక,ఆరోగ్యవంతమైన అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి.ఒత్తిడి సమయాల్లో బాధల్లో నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం నేర్చుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలి.

తిట్టకుండా ప్రేమతో మార్గనిర్దేశం చేయాలి. చిన్నప్పటినుండి మానవీయ విలువలు మంచి చెడు మధ్య తేడాలు నేర్పాలి.స్వీయ నియంత్రణ,స్నేహితుల ఎంపిక గురించి అవగాహన కల్పించాలి.కుటుంబంలో సానుకూల వాతావరణం కల్పించాలి. డ్రగ్స్ బానిసత్వం నుండి బయటపడడానికి ఆత్మవిశ్వాసం-సంకల్పం-సహాయం తీసుకునే ధైర్యం అత్యంత కీలకం.

ప్రతి చిన్న ప్రయత్నం గొప్ప మార్పుకు నాంది కావచ్చు.వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నషా ముక్త్ భారత్ గా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది.డ్రగ్స్ ని వదిలిపెడదాం – డ్రీమ్స్ ని ఆచరణలో నిజం చేద్దాం.
లివిన్ స్టన్
పి జి టి సోషల్ స్టడీస్
ఎం జె పి రఘునాథపాలెం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button