
మీ పని చేస్తే నాకేంటి.. ప్రభుత్వ కార్యాలయాల్లో దళారుల దోపిడి
పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో దళారుల చేతివాటం ఎక్కువైందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలను ముందుగానే వీరిని కలిసి ఏ పని కోసం వచ్చామో చెప్పాల్సిందే. దళారులు మెల్లిగా కార్యాలయానికి వచ్చిన వారితో మాట కలిపి ఎందుకు వచ్చారు…
‘రేషన్ కార్డు కోసమా కాస్ట్, ఇన్కమ్ లేక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, భూభారతి ఏదైనా మాకు చెప్పండి డబ్బులు ఇస్తే మేమే దగ్గర ఉండి చేయిస్తాం..
మీరు పదే పదే కార్యాలయం చుట్టూ తిరగనవసరం లేదు’ అని మాయమాటలు చెబుతూ.. వారి నుంచి ఒక్కో పనికి ఒక్కో రేటు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారు.
బద్నాం అవుతున్న ఉద్యోగులు..
ప్రజలు నేరుగా వెళితే పనులు త్వరితగతిన అవ్వకపోగా కొంతమంది సిబ్బంది ఛీదరించుకోవడం అక్కడ ఇచ్చి వెళ్లండి మేము చూసుకుంటాం అని చెప్పడం వారం గడిచిన తర్వాత వెళ్లి అడిగితే మీ అప్లికేషన్ ఎక్కడ ఉందో వెతకాలి తర్వాత రండి అనే సమాధానాలు ఎదురవుతుండటంతో ప్రజలు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించక తప్పడం లేదు.
కార్యాలయంలో కొంతమంది సిబ్బంది దళారులతో కుమ్మకై పని వెంటనే చేయించినందుకు వాటాల రూపంలో ఆఫీస్ టైమ్ అయిపోయాక వచ్చిన డబ్బులను పంచుకుంటున్నట్లు తెలుస్తోంది..ఈతతంగం అంతా తహసీల్దార్ కు తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా అని ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం విశేషం.
ఆ సిబ్బందితో దళారులతో కుమ్మక్కు…
దళారులు, కొందరు రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కయ్యారని, ప్రజలు ఇచ్చే డబ్బులను పంచుకుంటూ ఈ దళారీ వ్యవస్థకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇక్కడి దళారులు ఇటీవల ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇప్పించేందుకు ఒక కుటుంబం దగ్గర రూ.20వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రేషన్ కార్డుల కోసం ప్రజలు అధిక సంఖ్యలో ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడంతో ఇదే అదునుగా భావించి రెవెన్యూ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని ప్రతి రోజు తహసీల్దార్ కార్యాలయంలో కూర్చుని లక్షల్లో సంపాదిస్తున్న ట్లు బాధితుల ద్వారా బహిర్గతం అవుతుంది.
ఇలా పెద్ద మొత్తంలో దళారులు తయారై రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ధారా ప్రసాద్, పాల్వంచ తహసీల్దార్
పాల్వంచ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఎంతో కృతనిశ్చయంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారు. ఈ దళారి వ్యవహారం ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. వారు ఎవరైనా ఉంటే గేటు బయటనే ఉంచుతాం.

లోపలికి కూడా రానివ్వను. ప్రజలు ఏపని విషయంలో నైనా ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫిర్యాదు అందిస్తే అటువంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటా. సిబ్బందికి సైతం పలు సూచనలు చేసి జాగ్రత్తలు తీసుకుంటాం.