HyderabadPoliticalTelangana

కానిస్టేబుల్ల శిక్షణకు సర్వం సిద్ధం….

కానిస్టేబుల్ల శిక్షణకు సర్వం సిద్ధం....

హైదరాబాద్‌: పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి ఎట్టకేలకు శిక్షణ మొదలుకానుంది. ఈ నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. రాజాబహదూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, పోలీస్‌ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), జిల్లా శిక్షణ కేంద్రాలు(డీటీసీలు), నగర శిక్షణ కేంద్రాలు(సీటీసీలు) ఇందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి సివిల్‌, ఏఆర్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు.

అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్‌ఎస్‌పీ విభాగానికి చెందిన 5,010 మందికి కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి మరో రెండు రోజుల్లో శిక్షణను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఆయా కేంద్రాల ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన అర్హత పరీక్షల తుది ఫలితాలు అక్టోబరులోనే వెలువడినా న్యాయపరమైన వ్యాజ్యాల కారణంగా తుది ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 14న ఎల్‌బీ స్టేడియంలో కానిస్టేబుళ్లకు ఎంపిక పత్రాలను అందజేసిన నేపథ్యంలో శిక్షణ విభాగం ఇన్‌ఛార్జి ఐజీపీ అభిలాషాబిస్త్‌ శిక్షణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు.

టీఎస్‌ఎస్‌పీ కోసం కేంద్రాల అన్వేషణ

టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్ల శిక్షణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్‌ విభాగంతోపాటు ఏపీ, కర్ణాటక పోలీసుశాఖలకు తెలంగాణ శిక్షణ విభాగం లేఖలు రాసింది.

అక్కడి కేంద్రాల్లో అనుమతి లభిస్తే ప్రారంభించాలని యోచిస్తున్నారు. కుదరని పక్షంలో 9 నెలలపాటు జరిగే ఇతర కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

పోలీసు అకాడమీలో ఇప్పటికే 500 మందికిపైగా ఎస్సైలు శిక్షణలో ఉండగా.. మరో 653 మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే వరంగల్‌ పీటీసీలో వెయ్యి మంది సివిల్‌, మేడ్చల్‌ పీటీసీలో సుమారు 400 మంది ఏఆర్‌ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button