
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు కలకలం..
బూర్గంపాడు : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే క్రమంలో కుళ్లిన కోడిగుడ్లు దర్శనమిస్తున్నాయి.
ప్రభుత్వం బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందిస్తోంది.అయితే ఏ లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీలను ఏర్పాటు చేసిందో అది పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు.
అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహర పదార్థాల్లో నాణ్యత లోపం ఉన్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
బూర్గంపాడు మండలంలోని సారపాక గాంధీనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం చిన్నారులకు కోడిగుడ్లు అందజేయగా అవి కుళ్లిపోయి ఉండటంతో వారు షాక్ అయ్యారు.
ఇలాంటివి పిల్లలు, గర్భిణులు తింటే వారి ఆరోగ్యం ఏమవుతుందో అని వారు ఆందోళనకు గురయ్యారు. సాగర్ తులసి అనే మహిళ కుమారుడికి కోడి గుడ్లు అందజేయగా అవి కుళ్లిపోయి కనిపించాయి.
దీనిపై అంగన్వాడీ కార్యకర్తను నిలదీయగా.. గుడ్డు తడవడం వల్ల అలా అయి ఉండవచ్చని చెప్పారని బాధితురాలు తెలిపారు. ఇదే గాంధీ నగర్ అంగన్వాడి సెంటరులో పలుమార్లు ఇలా కుళ్ళిన కోడిగుడ్లు అందజేశారని బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు చెబుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి ఆ అంగన్వాడి సెంటరును సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై బూర్గంపాడు సీడీపీఓ రేవతిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.