
అరేయ్ కోట లేరా అంటూ ఎక్కి ఎక్కి ఏడ్చేసిన బ్రహ్మానందం…
టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ సినీపరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల సినీప్రయాణంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తన నటనతో ప్రేక్షకులను అలరించారు.
కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 83 ఏళ్ల కోట.. తెల్లవారజామున 4 గంటలకు తన నివాసంలో కోట తుదిశ్వాస విడిచారు కోట మృతికి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
కోటతో అనుబందం ఉన్న నటులంతా.. కోట నివాసానికి చేరుకుంటున్నారు. కోట భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.
లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి వార్త వినగానే, ఆయన స్నేహితుడు, సహనటుడు బ్రహ్మానందం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
“అరేయ్ కోట.. ఏడుపొస్తుంది” అంటూ ఒక్కసారిగా కన్నీరుమున్న విడిచిన ఆయన.. గాఢ స్నేహాన్ని, మంచి నటుడిని కోల్పోయిన లోటును ఆవేదనతో తెలిపారు.
కోటతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బ్రహ్మానందం మాట్లాడుతూ.. మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఆయన చూపిన అభినయం, సెట్‌పై గడిపిన మధుర క్షణాలు జీవితాంతం మర్చిపోలేను.
ఆయన ముక్కుసూటి నడవడి, నిజాయితీ గల మాటలు.. అవే ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.
కాగా.. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న జన్మించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించారు కోట. రాజకీయవేత్తగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.
1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 750కి పైగా చలనచిత్రాలలో నటించారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు కోట శ్రీనివాస రావు.
కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జన్మించారు. కోట తండ్రి సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో ఉండేవారు. ఆయన కోట శ్రీనివాసరావుని తన లాగే డాక్టర్ని చేయాలని భావించారు. కానీ, మొదటి నుంచి కళల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్న కోట శ్రీనివాసరావు, తొలుత రంగస్థలంపై నటించారు.
ఎన్నో నాటికలు, నాటకాలను పదేపదే వేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయనకు ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో అవకాశం వచ్చింది. ‘ఎవరో కోట శ్రీనివాసరావుట.. స్టేజి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చి నటించేస్తున్నాడు’ అంటూ టాక్ మొదలైంది.
నటన పట్ల ఉన్న ఆసక్తి కారణంగా బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదులుకున్న ఆయన, ఇక పూర్తిగా సినిమాలపైనే తన దృష్టి పెట్టారు.
అలా కొంతకాలం పాటు వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్లిన ఆయనకి, ‘ప్రతిఘటన’ సినిమాతో తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో దుర్మార్గుడైన రాజకీయ నాయకుడిగా ‘కాశీ’ పాత్రలో ఆయన జీవించారు.
కొత్త మేనరిజంతో సరికొత్త విలనిజానికి ఆయన తెరతీశారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అందులోని విలన్ పాత్రను గురించి మాట్లాడుకోవడం విశేషం .. అదే కోట ప్రత్యేకత.
ఇక అప్పటి నుంచి తెలుగు కథలో హీరోను టెన్షన్ పెట్టేసే ఒక పవర్ఫుల్ విలన్ దొరికిపోయాడు. విలన్ కేటగిరిలో వేషం ఏదైనా .. యాస ఏదైనా అందుకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ ను మార్చేస్తూ డైలాగ్స్ చెప్పడంలో కోట సిద్ధహస్తుడు.
బాడీ లాంగ్వేజ్ కీ .. డైలాగ్ కి ఎక్స్ ప్రెషన్ ను మ్యాచ్ చేస్తూ, లోతైన ద్వేషం .. విరుగుడు లేని విలనిజం చూపించడంలో ఆయనకి ఆయనే సాటి. డైలాగ్ ను ఎలా విడగొట్టాలో.. సన్నివేశాన్ని ఎలా పదునెక్కించాలో ఆయనకి బాగా తెలుసు. ‘శత్రువు’ .. ‘గణేశ్’ తరహా సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి.
ఇలా ఒకటా .. రెండా .. 4 దశాబ్దాలకి పైగా ఆయన చేసిన ప్రయాణం గురించి 4 పేరాల్లోనో .. 4 పేజీల్లోనో చెప్పుకోలేం. కోట చేసిన విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలను గురించి చెప్పుకోవాలంటే, అసమానమైన ఆయన అభినయంపై రాసిన ఒక గ్రంథం గురించి మాట్లాడుకోవడమే అవుతుంది.