
నా జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా.. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కత్తితో బెదిరింపులు
‘నా జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా’ అంటూ జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ అధికారులను బెదిరిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన నిందితుడిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీ ప్రధాన రహదారిపై ప్లాట్ నెంబర్ 224(ఏ)లో నూకారపు రామకృష్ణ అనే వ్యక్తికి సుమారు 200 గజాల స్థలం ఉంది.
వారంరోజులుగా ఈ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణపనులు చేస్తున్న రామకృష్ణ తన ప్లాట్‌కు కుడివైపున ఉన్న రోడ్ నెం 6లోకి సుమారు 5అడుగుల మేర ఆక్రమించారు.
దీంతో ఎమ్మెల్యే కాలనీ అధ్యక్షుడు నారాయణరెడ్డితో పాటు సభ్యులు జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేశారు. కాగా వారి ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు శుక్రవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ విభాగం సెక్షన్ అధికారి సాయికిరణ్, చంద్రయ్య, శివసాయి అక్కడకు వచ్చారు.
రోడ్డుమీదకు వచ్చి ప్రహరీ ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. సొసైటీ లే అవుట్‌లో 40ఫీట్ల రోడ్డు ఉండాలని, ఇప్పటికే సుమారు 10 అడుగులు కుంచించుకుపోయందని, ముందుకు రావద్దని సూచించారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనయిన రామకృష్ణ వీరంగం సృష్టించాడు. తన జోలికి వస్తే అంతుచూస్తానని, తనకు ప్రభుత్వంలో పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు.
పత్రాలు చూపిస్తే సరిపోయే దానికి ఎందుకు బూతులు తిడుతున్నారంటూ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ప్రశ్నించగా రెచ్చిపోయిన రామకృష్ణ పరుగెత్తుకుంటూ వెళ్లి తన కారులోంచి తల్వార్‌ను తీసుకువచ్చి నరికేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
దీంతో టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమ సిబ్బంది విధులను అడ్డుకోవడమే కాకుండా కత్తి తీసుకువచ్చి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడంటూ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు నిందితుడు నూకారపు రామకృష్ణ మీద బీఎన్‌ఎస్ 132, 351(2),పీడీపీపీ యాక్ట్‌తో పాటు ఆర్మ్స్ యాక్ట్స్ కింద కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.