
రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్టు
నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేశారు. అద్దంకి సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకుని కోవూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. కోవూరులో ఓ ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వ హయాంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ సహకారంతో అరుణ పలు సెటిల్‌మెంట్లు, నేరాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
నాలుగు రోజుల క్రితం కూడా సీఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారని వార్తలు వచ్చాయి. హోం శాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి ఆమె బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం.
కాగా, అరెస్టుకు ముందు కూడా అరుణ సోషల్‌మీడియాలో కీలక పోస్టు చేశారు. అక్రమ అరెస్టు థ్యాంక్యూ అందరికీ అని పోస్టు చేశారు.ఆ పోస్టు కంటే ముందు కూడా తన అరెస్టుపై అరుణ ఒక పోస్టు చేశారు.
ఒకవైపు చంపుతారనే వార్తలు వస్తున్నాయి.. మరోవైపు అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయని అరుణ తెలిపారు. ఇకపై తనకు ఎవరూ కాల్ చేయవద్దని సూచించారు. ఏ మీడియా ముందుకు రాలేనని, తన ఫోన్‌ను ఆఫ్ చేస్తున్నానని పేర్కొన్నారు.
తప్పు చేయకపోయినా శిక్షలు వేయాలని చూస్తున్న సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నేను టీడీపీ కాదు.. వైసీపీ కాదు.. నాకోసం వాళ్లు సోషల్‌మీడియాలో కొట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు.