
పురుగుల మందు తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..
రంగారెడ్డి- హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనీషా (28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన మనీషా.. శనివారం (ఆగస్టు 2) చికిత్స పొందుతూ కన్నుమూసింది.
మనీషా 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గత ఐదు సంవత్సరాలుగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. కుటుంబ కలహాల కారణంగానే వారం రోజుల క్రితం నంది హిల్స్‌లోని తన ఇంట్లో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, వారం రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
మనీషా మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
భర్త వేధింపుల కారణంగానే మనీషా ఈ దారుణ నిర్ణయం తీసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో కూడా కలకలం రేపింది.
ఆత్మహత్యకు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ముఖ్యంగా.. మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు బానిస కావడం వంటివి ఉంటున్నాయి.
వీటితో పాటు.. చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి విషయాల్లో ఒత్తిళ్లు, ఒంటరితనం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. సంబంధిత వైద్యులను, మానసికి నిపుణులను సంప్రదించడం మంచిది. కానీ.. జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ వ్యక్తికి మాత్రమే కాదు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్రంగా ప్రభావితం అవుతారు.