
ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర
తెలంగాణ వైద్య చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భారీ ఎత్తున వివిధ ఉద్యోగాలను భర్తీ చేసి గ్రామీణ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఈసారి ఏకంగా 1623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తోంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విధివిధానాలు పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లా, ఏరియా ఆసుపత్రులతోపాటు కమ్యూనిటీ సెంటర్లలో వైద్య సేవలు మెరుగు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో సుమారు 8 వేల పోస్టులని భర్తీ చేసిన ప్రభుత్వం… మరో 7 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇందులో భర్తీ ప్రక్రియలో ఉన్న ఉద్యోగాల వివరాలు గమనిస్తే
2322 స్టాఫ్ నర్స్
1284 ల్యాబ్ టెక్నీషియన్
732 ఫార్మసిస్ట్
1931 ఎంపీహెచ్ఎస్ ఫీమేల్
48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్
4 స్పీచ్ పాథాలజిస్ట్
607 అసిస్టెంట్ ప్రొఫెసర్ లు ఉన్నాయి… ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే ఊపులో ఖాళీగా ఉన్న మిగతా ఉద్యోగాలను సైతం భర్తీ చేసి వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.




