
తండ్రి నడుపుతున్న రొటోవేటర్‌లో పడి.. ఐదేళ్ల బాలుడి దుర్మరణం
కన్న తండ్రి కళ్లెదుటే ముక్కలుముక్కలైన కుమారుడు
సెలవుదినం కావడంతో తండ్రితో కలిసి చేనుకు వెళ్లిన కొడుకు
కొద్దిసేపట్లోనే తునాతునకలై విగతజీవిగా ఇంటికి..
ఖమ్మం జిల్లా కూసుమంచి కొత్తతండాలో విషాదం
తాను కన్న కుమారుడే తన చేతిలో ఎన్నటికీ కానరాని లోకాలకు వెళ్తాడని బహుశా ఏ తండ్రీ ఊహించి ఉండడు.
తన కన్నయ్యే (కొడుకు) సరదాగా తనతోపాటు చేనుకు వస్తానంటే ఏ తండ్రి మాత్రం వద్దనగలడు? కానీ ఆ సరదానే తన కన్నయ్యను తనకు దూరం చేస్తుందని ఆ తండ్రి కలలో కూడా కలగని ఉండడు. కానీ ఘోరం జరిగింది. విధి వక్రీకరించింది.
తాను పక్కనుండగా తన కన్నయ్యపై ఈగను కూడా వాలనీయనన్న ఆ తండ్రి ధైర్యం, తన తండ్రి తన పక్కనుండగా తనను మరేమీ తాకలేదన్న భరోసా.. రెండూ విధి ముందు నిజం కాలేకపోయాయి. తనవెంట వస్తానంటూ మారం చేసిన కొడుకును ముద్దుచేస్తూ తీసుకెళ్లిన ఆ తండ్రి.. కొద్ది నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా తీసుకొచ్చిన విషాదం..
కూసుమంచి మండలంలోనిది. ఐదేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు తండ్రి సమక్షంలోనే, తండ్రి నడుపుతున్న రొటోవేటర్‌లో పడి తునాతునకలై దుర్మరణం చెందిన విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండా పరిధిలోని కొత్తతండాకు చెందిన వడ్తియా రాంబాబు – దీపిక దంపతులకు భువనేశ్వర్ (5) అనే కుమారుడు, భువనేశ్వరి అనే కుమార్తె (కవలలు) ఉన్నారు. కుమారుడు భువనేశ్వర్ కూసుమంచిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు.
ఆదివారం సెలవుదినం కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. తండ్రి రాంబాబు సాయంత్రం సమయంలో చేను దున్నేందుకు ట్రాక్టర్‌కు రొటోవేటర్‌ను లింక్ చేసుకొని తోలుకుంటూ బయలుదేరాడు.
అయితే, తాము కూడా వస్తామంటూ కుమారుడు భవనేశ్వర్, అతడి స్నేహితుడైన మరో బాలుడు మారం చేయడంతో వారిని ట్రాక్టర్ వెనుక రొటోటేటర్‌పై కూర్చోబెట్టుకొని చేను వద్దకు వెళ్లాడు.
అక్కడ రొటోవేటర్ పైభాగంలో కుమారుడు భువనేశ్వర్‌ను, అతడి స్నేహితుడైన మరో బాలుడిని కూర్చోబెట్టుకొని రాంబాబు తన చేను చదును చేస్తున్నాడు.
ఈ క్రమంలో కుమారుడు భువనేశ్వర్ ప్రమాదవశాత్తూ జారి ఒక్కసారిగా రొటోవేటర్ కింద పడిపోయాడు. క్షణాల్లోనే అతడి తల, మొండెం, ఇతర శరీర భాగాలు ముక్కలుముక్కలై వేరువేరుగా పడిపోయాయి.
ఆ వెంటనే భువనేశ్వర్ పక్కన కూర్చున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో రాంబాబు వెనక్కు తిరిగి చూశాడు. అప్పటికే అతడి కుమారుడి దేహమంతా తునాతునకలైంది.
వాటన్నింటినీ తండ్రి ఒక్క దగ్గర చేర్చి బోరున విలపించాడు. తాను కన్న కొడుకునే తన చేతులారా పోగొట్టుకున్నానంటూ తల్లడిల్లిపోయాడు. ఈ విషాదకర ఘటనను చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టుకున్నారు.