
పుష్పరాజ్ లకు చుక్కలు చూపిస్తున్న ఫారెస్ట్ అధికారులు
షాద్ నగర్ లో విచ్చలవిడిగా కలప అక్రమ రవాణా
ఫేక్ బిల్లులతో అక్రమ ట్రాన్స్పోర్ట్ లపై అటవీ శాఖ ఉక్కుపాదం
షాద్ నగర్ పరిధిలో గత కొంతకాలంగా అక్రమ కలప రవాణా చేస్తున్న పుష్పపై నిఘా
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో రెచ్చిపోతున్న పుష్ప రాజ్ లపై అటవీశాఖ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. అటవీ శాఖ అధికారులు పర్మిషన్లు లేకుండా అక్రమ కలప రవాణా చేస్తున్న వాహనాలపై గత కొద్ది రోజులుగా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న తతంగాలపై మీడియాలో వార్తలు గుప్పుముకున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అక్రమ కలప రవాణా దారులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే సోమవారం షాద్ నగర్ నుండి హైదరాబాద్ వైపుగా వెళుతున్నటువంటి AP09 U 8490 నెంబర్ గల లారీలో అక్రమ కలప రవాణా చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వాహనాన్ని నందిగామ పరిధిలో ఆపి తనిఖీలు నిర్వహించగా అక్రమ రవాణా చేస్తున్నారని తెలుసుకొని వాహనాన్ని అదుపులో తీసుకున్నారు. నిత్యం నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక గ్రామం నుండి కలప రవాణా కొనసాగుతూనే ఉంది. నేడు అటవీ శాఖ అధికారులు పట్టుకున్న అక్రమ కలప రవాణా చేస్తున్న లారీ ఇటీవలే కొందుర్గు మండలంలో అడ్డంగా మీడియాకు దొరికిన లారీ ఒకటే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామ పరిధిలో అక్రమ కలప రవాణా చేస్తున్న సమాచారంతో మీడియా ప్రతినిధులు ఆ విషయాన్ని బయటకు చెప్పడంతో సదరు లారీ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యాయి. అయినా కలప రవాణా చేస్తున్న పుష్పరాజ్ లు ఏమాత్రం జంకకుండా మళ్లీ తమ పని యదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు నియోజవర్గంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి ఆటలు కట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్రమ కలప రవాణా చేస్తున్న లారీల యజమానుల వెనుక ఉండి నడిపిస్తున్న అసలు పుష్ప ఎవరనేది బయటకు తెలియాల్సి ఉంది. గతంలో కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ లో కలప లారీ పట్టుబడినప్పుడు కొందరు ఫోన్లలో మాట్లాడిన మాటలు వింటుంటే అల్లు అర్జున్ సినిమా పుష్ప ను మైమరపించే డైలాగులు వినిపించాయి. కలప అక్రమ రవాణా చేస్తున్న , వారికి సహకరించి అండగా నిలుస్తున్న అక్రమార్కులపై అటవీశాఖ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే షాద్నగర్ నియోజకవర్గం కాంక్రీట్ జంగల్ గా మారే అవకాశం లేకపోలేదు.