
ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి: గ్రూప్ 1 వివాదం పై కేటీఆర్ సంచలన ట్వీట్…
గ్రూప్-1 వ్యాల్యూయేషన్, ర్యాంకింగ్ జాబితాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది.
మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గతంతో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రీ వాల్యుయేషన్ చేపట్టాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
సర్కారు కొలువు కోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్నీ, అమ్మనాన్నల కష్టార్జితం బూడిదలో పూసిన పన్నీరైందని కామెంట్ చేశారు. పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్ వమ్ముజేసిందని అన్నారు.
అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోశారని కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశించినట్లుగా గ్రూప్-1 పరీక్ష మళ్లీ తాజాగా నిర్వహించాలి,
అవకతవకలపై జుడీషియల్ కమీషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలన్నారు. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.