
మీడియా అక్రెడిటేషన్ రూల్స్ లో పాత నిబంధనలకు స్వస్తి..
మరోమారు మాట నిలబెట్టుకున్న మంత్రి పొంగులేటి
జర్నలిస్టుల హక్కులకు కార్యాచరణ రూపం…
48 గంటల్లోనే అక్రిడిటేషన్లపై జీవో జారీ
డిజిటల్ మీడియాకు తొలిసారి స్పష్టమైన మార్గదర్శకాలు
అర్హతలు, పరిమితులు కఠినం.. దుర్వినియోగంపై కఠిన చర్యలు
ఖమ్మం: మాట ఇచ్చిన వెంటనే కార్యాచరణకు దిగడం, ప్రకటించిన హామీని ఆలస్యం లేకుండా అమలు చేయడం ఇదే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలనా శైలి అని మరోమారు రుజువైంది.
TWJF ఖమ్మం జిల్లా మహాసభ వేదికగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పొందేందుకు అవసరమైన విధివిధానాలపై పది రోజుల్లో జీవో జారీ చేస్తాం అని ప్రకటించిన మంత్రి ఆ మాటకు మరింత విలువ చేకూర్చుతూ 48 గంటలు గడవక ముందే జీవోను విడుదల చేయించారు.
ఈ వేగవంతమైన నిర్ణయం జర్నలిస్టుల హక్కుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు, మీడియాపై ఉన్న గౌరవానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ అంశానికి స్పష్టత రావడంతో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
మంత్రి పొంగులేటి ఇచ్చిన హామీ మాటలకే పరిమితం కాకుండా విధానాలుగా మారడంపై జర్నలిస్టు సంఘాల బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాట–చర్య మధ్య అంతరం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్న మంత్రి తీరు ప్రశంసనీయం. ఇది జర్నలిస్టుల భవిష్యత్తుకు భరోసా” అని వారు వ్యాఖ్యానించారు.
మీడియా సంక్షేమాన్ని పాలనా అజెండాలో ముందువరుసలో ఉంచుతూ, సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నిర్ణయంతో మరోమారు జర్నలిస్టుల విశ్వాసాన్ని సంపాదించుకున్నారు.



