
సామాన్లు కనపడేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదు : శివాజీ
హీరోయిన్ల అందం చీరలో, వారు నిండుగా కప్పుకొనే బట్టల్లో ఉంటుందని హీరో శివాజీ అన్నారు. ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సహాయక పాత్రలు, క్యారెక్టర్ రోల్స్‌లో తనదైన ముద్ర వేస్తూ దూసుకెళ్తున్నారు.
నటుడిగానే కాకుండా, తన స్పష్టమైన అభిప్రాయాలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.ఇటీవల బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొని తన మాటలతో, ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ, మరోసారి ప్రేక్షకుల ముందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నారు.
‘దండోరా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివాజీ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కథ పరంగా, కాన్సెప్ట్ పరంగా భిన్నంగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన శివాజీ, కొంతమంది హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవడం అందం కాదని’ ఆయన వ్యాఖ్యానించారు.
అమ్మాయిలు చీరకట్టు, సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆధునికత పేరుతో సంస్కృతిని విస్మరించడం సరైంది కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘ఆడదానిలో అమ్మను చూసుకుంటాం. అలాంటి అమ్మాయిలు చీరకట్టులో కనిపిస్తే ప్రకృతికే అందం వస్తుంది’ అని శివాజీ వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు సౌందర్య, సావిత్రి లాంటి మహానటులు చీరకట్టులోనే ఇండస్ట్రీని షేక్ చేశారని గుర్తు చేశారు. వారి అందం, అభినయం, వ్యక్తిత్వం వల్లే వారు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
ప్రస్తుత తరం హీరోయిన్ల విషయానికొస్తే, రష్మిక మందన్న లాంటి నటీమణులు పొట్టి డ్రెస్సులు వేసుకోకుండానే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారని ఉదాహరణగా చెప్పారు. విజయానికి దుస్తులే కారణం కాదని, ప్రతిభ, క్రమశిక్షణ, ప్రవర్తనే ముఖ్యమని ఆయన హితవు పలికారు.
ఇకనైనా హీరోయిన్లు పొట్టి బట్టలు కాకుండా, సంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని శివాజీ సూచించారు. తన మాటలు కొంతమందికి నొప్పించవచ్చని, వివాదాస్పదంగా అనిపించవచ్చని కూడా ఆయన అంగీకరించారు.
అయినప్పటికీ, తన ఉద్దేశం చెడు కాదని, ఇండస్ట్రీ మంచికోసమే ఈ మాటలు చెబుతున్నానని స్పష్టం చేశారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
కొంతమంది ఆయన అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా, శివాజీ మాటలు మరోసారి ఇండస్ట్రీలో డ్రెస్సింగ్, సంస్కృతి, ఆధునికతపై పెద్ద చర్చకు తెరతీశాయి.



