
తెలంగాణలో మరో ఎన్నికలకు ఈసీ రెడీ.. ఫిబ్రవరిలో మోగనున్న నగారా..!
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. అయితే, మరో ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
వచ్చే నెలలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ కీలక షెడ్యూల్ను విడుదల చేసింది.
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 1న ముసాయిదా ఓటరు జాబితాలను అధికారికంగా ప్రదర్శించనున్నారు.
ఈ జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించిన అనంతరం అదే నెల 10వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల (నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, కరీంనగర్, కొత్తగూడెం, రామగుండం) పరిధిలో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ఫిబ్రవరిలో ఎన్నికలు?
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిసి, కొత్త సర్పంచ్లు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు అందాల్సిన సుమారు రూ.700 కోట్ల నిధులు విడుదల కావాలంటే, మార్చి లోపు ఎన్నికలు పూర్తి చేయడం తప్పనిసరి.
రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. అప్పటి నుండి ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.
మరోవైపు, వచ్చే ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ గడువు ముగియనుండగా, మే నెలలో వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి ప్రధాన మున్సిపాలిటీల గడువు ముగియనుంది. వీటన్నింటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా లేక విడతల వారీగా వెళ్తారా అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. నిధుల సమీకరణ, పాలనా సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ ఎన్నికలను నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది.



