
స్వతంత్రుల ముసుగులో వస్తే నమ్మకండి!
- అధికారం లేని ప్రత్యర్థులతో అభివృద్ధి సాధ్యమా?
- ‘శీనన్న మనిషిని’ అని చెప్పుకుంటే బుద్ధి చెప్పండి
- అధికారం మనది.. అభివృద్ధి చేసేది మనమే : మంత్రి పొంగులేటి
కొత్తగూడెం : “ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే కొత్త అవతారాలను నమ్మవద్దు.. ‘నాకు శీనన్న తెలుసు, ఆయనకు నేను సన్నిహితుడిని’ అంటూ మీ ముందుకు వచ్చే వారు ఎవరికీ దగ్గర కాదు” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజకీయ లబ్ధి కోసం సొంత మనుషులమని చెప్పుకునే వారి పట్ల కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అధికారం లేని వారికి ఓటెందుకు?
ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ.. “ప్రభుత్వం మనది, అధికారం మనది. అభివృద్ధి చేసే సత్తా కూడా మనకే ఉంది.
కనీసం అధికారం చేతిలో లేని ప్రత్యర్థులు ప్రజలకు ఏం చేస్తారు? వారు ఏ విధంగా అభివృద్ధిని తీసుకువస్తారు?” అని అన్నారు. అభివృద్ధి చేయాలన్నా, నిధులు తేవాలన్నా అది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమని స్పష్టం చేశారు.
ఇండ్లు ఇచ్చేది నేనే.. పట్టాలు ఇచ్చేది నేనే!
గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలు తన వద్దే ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చే అధికారం తనకు ఉందని పొంగులేటి పేర్కొన్నారు.
ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రారంభిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం మన దగ్గర ఉన్నప్పుడు ప్రత్యర్థుల మాటలకు తావులేదని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
సైనికుల్లా కదలండి..
కాంగ్రెస్ – సీపీఎం కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త రేవంత్ రెడ్డిలా, పొంగులేటిలా మారి విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.
స్వతంత్రుల ముసుగులో వస్తున్న మోసకారి శక్తులకు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పి, కొత్తగూడెంపై హస్తం జెండా ఎగురవేయాలని మంత్రి పిలుపునిచ్చారు.



