
భర్త ప్రాణాల కోసం భార్య మంగళ సూత్రం తాకట్టు
Web desc : తాళిబొట్టు తాకట్టు పెట్టి భర్త ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న భార్య గాథ హృదయాలను కలిచివేస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ గ్రామానికి చెందిన బోయన్‌పల్లి (బుకా) సుమిత్ (30) అనే యువకుడు మూడునెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
ఆపరేషన్ కోసం అప్పుల పాలయ్యారు. “ఆపరేషన్ అయింది. ఇక బాగుపడతాడు” అనుకునే లోపే కొత్త కష్టాలు మొదలయ్యాయి. అతని శరీరంలో రక్తం తగ్గిపోవడం, వాపులు రావడం, నడవలేని స్థితి… కుటుంబం మళ్లీ ఆసుపత్రుల దారి పట్టింది.
శనివారం ఆదిలాబాద్‌లోని Rajiv Gandhi Institute of Medical Sciencesకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి Osmania General Hospital, గాంధీ హాస్పిటల్ లో చేర్చుకోలేమని చెప్పడంతో కుటుంబం కళ్ల ముందే ఆశలు కూలిపోయాయి.
చివరకు హైదరాబాద్‌లోని నిమ్స్ లో సోమవారం అర్ధరాత్రి 3 గంటలకు చేర్పించారు. కానీ అక్కడ కూడా పరీక్షలు, మందులు, రక్తం అన్నింటికీ డబ్బే ఆధారం.
చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు అడగడానికి కూడా ఎవ్వరూ మిగలలేదు. ఇక భర్త ప్రాణాలు కాపాడాలంటే ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆ భార్య తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టింది.
“మంగళం”గా కట్టిన ఆ తాళి… ఈరోజు భర్త ప్రాణాలకు ధనరాశిగా మారింది. వారం రోజుల క్రితం తల్లిని కోల్పోయిన ఆమెలో కన్నీళ్లు ఆరలేదు. అయినా కళ్లలో నీరు, గుండెల్లో బాధ, చేతిలో పిల్లల చేతులు.. ఒక బాబు, ఒక పాప భవిష్యత్తు ఆమె ముందుంది.
ఆసుపత్రి కారిడార్లలో భర్త పడక దగ్గర కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటూ, ఒక్కో రూపాయి కోసం అల్లాడుతున్న ఆ భార్యను చూసిన వారంతా చలించిపోతున్నారు. “డబ్బు లేక ప్రాణం పోకూడదు” అనే మాటలు కాగితాలకే పరిమితం అవుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ కుటుంబానికి అవసరం సానుభూతి కాదు… సహాయం. మానవత్వంతో ముందుకొచ్చే దాతలు, ప్రజాప్రతినిధులు, సేవాసంస్థలు చేయూతనిస్తే ఒక యువ ప్రాణం నిలుస్తుంది. ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు చీకటిలో కలిసిపోకుండా ఉంటుంది.



