
మణికొండలో పేలిన మంజీరా నీటి పైప్‌లైన్… సెల్లార్లలోకి భారీగా నీరు
రంగారెడ్డి జిల్లా మణికొండలో మంజీరా నీటి పైప్‌లైన్ పేలి అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది.
అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో మణికొండ రోడ్డులో మంజీరా నీటి పైప్‌లైన్ భారీ శబ్దంతో పేలింది. ఐదు నిమిషాల్లోనే అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీరు నిండిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.
మణికొండలో గల పైప్‌లైన్ రోడ్‌లో భారీ నీటి పైప్‌లైన్ అర్ధరాత్రి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన వల్ల భారీ ఎత్తున నీరు విడుదల కావడంతో సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆరు అడుగుల మేర నీరు అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి చేరింది. అపార్ట్‌మెంట్లలో పార్క్ చేసిన దాదాపు 7 నుండి 8 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయి భారీగా దెబ్బతిన్నాయి.
సెల్లార్‌లో ఉన్న వస్తువులు, విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందిన వెంటనే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) బలగాలు, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పైప్‌లైన్ నీటిని వెంటనే నిలిపివేసి, సెల్లార్లలో ఉన్న నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




