
ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థులు మృ*తి
ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం (మార్చి 12) ఉదయం శంషాబాద్‌లోని పెద్ద షాపూర్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో పెద్ద షాపూర్ దగ్గర ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను బిక్కి సింగ్, సురజ్గా గుర్తించారు.
అదే మార్గంలో వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాదం గురించి తెలియడంతో ఘటన స్థలం దగ్గర ఆగారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదం గురించి ఆరా తీశారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికి అందొచ్చిన కొడుకులు పరీక్షకు వెళ్తూ విగతజీవులుగా మారడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.



