
ఆబ్కారీ శాఖ డీసీ సోమిరెడ్డిని అకారణంగా దూషించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్
నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి గారిని అకారణంగా ఆ శాఖ కమిషనర్ దూషించడాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. తోటి అధికారి అని కూడా చూడకుండా పరుష పదజాలంతో దూషించి, అవమాన పర్చిన ఆబ్కారీ శాఖ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి గారిని శుక్రవారం అదే శాఖ కమిషనర్ తోటి అధికారుల, సిబ్బంది ముందు పరుషపదజాలంతో దూషించడంతో పాటు తీవ్రంగా అవమానపర్చారని ఆరోపించారు. కమిషనర్ దూషణలతోనే సోమిరెడ్డి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయి ఆస్పత్రి పాలయ్యారన్నారు.
30 ఏళ్లుగా ఆబ్కారీ శాఖకు సేవలందిస్తున్న ఉత్తమ అధికారి సోమిరెడ్డిని కమిషనర్ అకారణంగా దూషించడం చాలా బాధకరంగా ఉందన్నారు. అన్ పార్లమెంటరీ భాషతో తోటి అధికారుల, సిబ్బంది ముందు పరుష పదజాలంతో దూషించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగులను దూషిస్తూ, వారి జీవితాలతో ఆడుకునే హక్కు ఏ ఒక పై అధికారికి లేదని స్పష్టం చేశారు.
సోమిరెడ్డి చేయని తప్పుకి “ వెధవ , ఇడియట్” అంటూ ఉన్నత స్థాయిలో ఉన్న కమిషనర్ మాట్లాడే అధికారం ఎక్కడదని ప్రశ్నించారు. కింది స్థాయిలో అధికారులు, సిబ్బంది ఏదైనా తప్పు చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రతి అధికారికి ఉంటుందని గుర్తు చేశారు. కానీ, నోరు పడేసుకోని ఉద్యోగులను అవమానపరుస్తూ, భయబ్రాంతులకు గురి చేసే పద్దతి మంచిది కాదన్నారు.
ఉద్యోగులను దూషిస్తూ, అవమానపరుస్తున్న ఆబ్కారీ శాఖ కమిషనర్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ తక్షణమే స్పందించాలన్నారు. నిజామాబాద్ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆబ్కారీ కమిషనర్‌ను ఆ శాఖ నుంచి తప్పించాలన్నారు. దీంతో విచారణ పారదర్శకంగా సాగుతుందన్నారు.
ఇదే విషయమై త్వరలోనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీగా సీఎం రేవంత్‌రెడ్డి గారిని, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుగారిని, సీఎస్ గారిని కూడా కలువనున్నట్టుగా చెప్పారు. ఆబ్కారి శాఖ కమిషనర్ తీరుపై మాట్లాడటంతో పాటు చర్యలకు కూడా డిమాండ్ చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా ఉండాలనే విషయాన్ని కూడా ప్రభుత్వ పెద్దలను కోరనున్నట్టుగా తెలిపారు.




