
‘నన్ను టచ్ చేస్తే.. ఒక్క ఓటు కూడా పడనివ్వను’.. రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ ఘాటు వ్యాఖ్యలు
Web desc : రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘నన్ను టచ్ చేస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఓటు కూడా పడనివ్వను.. ఇది నా ఇగోతో మాట్లాడటం లేదు.. నా వెనక ఉన్న నాసైన్యమే నాకు బలం.. ప్రతిపక్ష పార్టీ నేతలు హద్దుమీరి మాట్లాడొద్దు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
తనపై విమర్శలు చేసే వారు హద్దులు దాటితే తగిన విధంగా స్పందిస్తాననే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ ఎన్రోల్మెంట్ మేళాలో కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, యువతీ యువకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పరిధిలో ఇప్పటికే లక్షన్నర మంది యువతతో పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొని ప్రధాన పార్టీలకంటే మిన్నగా పట్టభద్రులతో మమేకమౌతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
నన్ను టచ్ చేస్తే.. ఒక్క ఓటు కూడా పడనివ్వను..
తనపై, తన వ్యక్తిత్వం పై, తన విద్యార్థులపై రాజకీయంగా విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి కిరణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. నన్ను టచ్ చేయొద్దు.. హద్దుమీరి మాట్లాడొద్దు అంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్య ఏ రాజకీయ పరిణామాన్ని ఉద్దేశించి చేశారనే అంశంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. తన రాజకీయ లేదా సామాజిక ప్రయాణం కంటే ముందుగా యువత, ఉద్యోగార్థుల కోసం చేసిన సేవలను కిరణ్ కుమార్ ప్రస్తావించారు.
వేలాది మంది ఉద్యోగులను తీర్చిదిద్దిన చరిత్ర తనదని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల పరిస్థితిని దగ్గరగా చూశానని, వారి కన్నీళ్లు తనను కదిలించాయని అన్నారు. ఉద్యోగం సాధించాలనే యువత కలలకు కార్యరూపం ఇవ్వాలనే ఉద్దేశంతో రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ ద్వారా శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు.
కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా నిరుపేదలు, ఉద్యోగార్థులకు అందుబాటులో ఉండేలా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో విద్యా, ఉద్యోగ శిక్షణ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగార్థులను వదిలి పెట్టలేదని కిరణ్ కుమార్ తెలిపారు. ఆర్సీ ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అండగా నిలిచామని చెప్పారు.
అలాగే పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన సిబ్బంది పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థులకు అకాడమీ ద్వారా ఉచిత కోచింగ్ అందించినట్లు తెలిపారు. ఉద్యోగ సాధన కోసం యువత పడుతున్న కష్టాలను తాను ప్రత్యక్షంగా చూశానని, అందుకే వారి భవిష్యత్తుకు తన వంతు సహకారం అందిస్తున్నానని పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఓటర్ ఎన్రోల్మెంట్ మేళాకు యువత నుంచి భారీ స్పందన లభించింది. గ్రాడ్యుయేట్లకు ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు.
యువత విద్య, ఉద్యోగ సాధనతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకైన భాగస్వాములు కావాలని మెండెం కిరణ్ పిలుపునిచ్చారు. యువతే బలం.. రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు ఓ వైపు యువత కోసం అకాడమీ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే.. మరోవైపు తనను విమర్శిస్తున్న ప్రతిపక్ష నేతలకు కిరణ్ కుమార్ చేసిన హెచ్చరికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
యువత, గ్రాడ్యుయేట్లతో మమేకం అవుతూ నిర్వహించిన ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలోనే ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేయడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. కిరణ్ కుమార్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.