
మద్యం మత్తులో ఫార్చ్యూనర్ డ్రైవర్ బీభత్సం.. గాల్లో పల్టీలు కొట్టిన ఐ20 కారు..
Web desc : మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని వరంగల్ హైవే పిల్లర్ నంబర్ 57 వద్ద ఉదయం సుమారు 6:30 గంటలకు ఓ ఫార్య్చూనర్ కారు ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలకు తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన యువకుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సాయిశివ (30), తన భార్య మేఘన (28)తో కలిసి TS08 ER 7435 నంబరు గల ఐ10 కారులో ఎల్బీ నగర్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట వైపు బయలుదేరారు. వీరి కారు పీర్జాదీగూడ హైవే పిల్లర్ నంబర్ 57 సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టయోటా ఫార్చ్యూనర్ కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ధాటికి ముందున్న ఐ10 కారు పల్టీ కొట్టింది. అనంతరం ఫార్చ్యూనర్ కారు ముందుకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని సైతం ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిశివ, మేఘన దంపతులను చికిత్స నిమిత్తం చైతన్యపురిలోని ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. నకిలీ నంబర్ ప్లేట్.. లైసెన్స్ లేని డ్రైవర్.. ఫార్చ్యూనర్ కారు నడిపిన వ్యక్తిని నారపల్లికి చెందిన మంగీలాల్ కుమారుడైన 19 ఏళ్ల అకున్ సబర్వాల్గా గుర్తించారు.
సదరు వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది. అంతేకాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయగా తన వద్ద లైసెన్స్ లేదని తెలిపినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్ కారుకు అమర్చిన నంబర్ ప్లేట్ కూడా నకిలీదిగా పోలీసులు గుర్తించారు.
వాహనదారుడితో పాటు యజమానిపై కేసు నమోదు.. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 281, 125(a) తో పాటు మోటారు వాహనాల చట్టం (MV Act) లోని సెక్షన్లు 181, 185(a), 183, 184, 185, 179(1), 179(2), 80(A), 50, 51 కింద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసి కూడా వాహనం నడపడానికి అనుమతించినందుకు వాహన యజమాని మంగీలాల్‌పై కూడా MV Act సెక్షన్ 180 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల హెచ్చరిక… మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నకిలీ నంబర్ ప్లేట్లు వాడటం చట్టరీత్యా తీవ్రమైన నేరాలని పోలీసులు తెలిపారు.
అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను ఎల్లప్పుడూ కలిగి ఉండాలని సూచించారు.