
‘ఆత్మహత్యకు అనుమతివ్వండి’.. ప్రజావాణిలో కుటుంబం వినతి
జగిత్యాల : తనకు న్యాయం జరగడం లేదని, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ మెట్‌పల్లికి చెందిన మ్యాడం గోవర్ధన్ తన భార్యా పిల్లలతో కలిసి ప్రజావాణికి వచ్చి తన ఆవేదనను అధికారుల ముందు వెళ్లగక్కాడు. మెట్పల్లి-వెల్లుల్ల రోడ్డులో 2021లో నలుగురు భాగస్వాములుగా తనకు చెందిన షెట్టర్ లో మెడికల్ షాప్ ఏర్పాటు చేసినట్లు గోవర్ధన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఒప్పందం ప్రకారం ఐదేళ్ల గడువు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా షాపును తనకు తిరిగి అప్పగించడం లేదని ఆరోపించాడు. తన భాగస్వామి సంతోష్‌ను షాపు అప్పగించాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీంతో షాపు వద్దకు వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు న్యాయం జరిగే మార్గం కనిపించడం లేదని, తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నానని పేర్కొన్న గోవర్ధన్.. తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను వేడుకున్నాడు. తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయకపోతే చావే దిక్కని మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. గోవర్ధన్ సమర్పించిన ఫిర్యాదును పరిశీలించిన ప్రజావాణి అధికారులు తదుపరి చర్యల నిమిత్తం పోలీసు అధికారులకు బదిలీ చేశారు.