
ఫేస్బుక్ పరిచయం.. కస్టమ్స్ అధికారులమంటూ మహిళకు రూ.27.23 లక్షలకు టోకరా!
Web desc : సోషల్ మీడియా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, కస్టమ్స్ అధికారుల పేరుతో మోసగాళ్లు ఓ మహిళ నుంచి రూ.27.23 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. యాప్రాల్ పరిధిలోని కౌకూర్‌కు చెందిన 48 ఏళ్ల మహిళకు సెప్టెంబర్ 16న ఫేస్బుక్లో ‘మార్క్ విల్సన్’ పేరుతో ఓ వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని అంగీకరించిన ఆమె, అనంతరం వాట్సాప్ ద్వారా అతడితో సంభాషణ కొనసాగించారు.
అక్టోబర్ 1న తనకు పార్సిల్ పంపించానని, అందుకు సంబంధించిన ట్రాకింగ్ నంబర్‌ను సదరు వ్యక్తి ఆమెకు పంపించాడు.అక్టోబర్ 2 నుంచి ముంబై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులమంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను సంప్రదించారు. పార్సిల్ క్లియరెన్స్, జరిమానాలు, కరెన్సీ మార్పిడి, మనీలాండరింగ్ ధ్రువీకరణ, ఇన్సూరెన్స్ తదితర కారణాలు చెబుతూ విడతలవారీగా డబ్బులు డిమాండ్ చేశారు.
సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు.. పార్సిల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే భయంతో బాధితురాలు వారు సూచించిన ఖాతాలకు పలుమార్లు నగదు బదిలీ చేశారు.ఈ క్రమంలో మొత్తం రూ.27,23,000 మోసపోయినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్టోబర్ 27న ఫిర్యాదు అందడంతో మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఇన్స్పెక్టర్ ఎల్. కృష్ణం రాజుకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ప్రజలకు పోలీసుల సూచన: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు పంపించే పార్సిళ్లు, విదేశాల నుంచి బహుమతులు వచ్చాయనే సందేశాలు, కస్టమ్స్ క్లియరెన్స్ లేదా ఇతర చార్జీల పేరుతో చేసే డబ్బు డిమాండ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అధికారులమని చెప్పుకునే గుర్తుతెలియని వ్యక్తులకు ధ్రువీకరణ లేకుండా డబ్బులు పంపవద్దు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో సమాచారం అందించాలి.