
కొత్తూరులో కన్న కూతురిని హతమార్చిన తల్లి అరెస్ట్!
షాద్నగర్ జోన్ డీసీపీ సి. శిరీష రాఘవేంద్ర వెల్లడి
ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం.. పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి వచ్చిన అసలు విషయం
షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు సి కె న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 28
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పరిధిలోని కన్న కూతురి మరణం తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తు, పోస్టుమార్టం నివేదికతో ఈ ఘటన హత్యగా మారింది.
షాద్నగర్ జోన్ డీసీపీ సి. శిరీష రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక సువర్ణ అలియాస్ లవ్లీ మృతి కేసులో ఆమె తల్లి ముయ్యాది విజయలక్ష్మి (34)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్ అధికంగా ఉపయోగించడం, మాట వినడం లేదనే కారణాలతో తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు ప్రెస్నోట్లో పేర్కొన్నారు.
కొత్తూరులోని హనుమాన్ టెంపుల్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ముయ్యాది రాజు కుమార్తె సువర్ణ అలియాస్ లవ్లీ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 27న ఇంట్లో బాలిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు తొలుత కొత్తూరులోని ఆసుపత్రికి, అనంతరం వైద్యుల సూచన మేరకు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన కొత్తూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, గొంతు నులిమివేయడం వల్ల మరణించినట్లు సూచించే వైద్య నివేదిక వెలువడిందని పోలీసులు తెలిపారు. దీంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు.
గొంతు నులిమి.. ఆత్మహత్యగా చిత్రించే యత్నం?
పోలీసుల దర్యాప్తు ప్రకారం, అక్టోబర్ 27న సాయంత్రం సుమారు 5.30 గంటలకు ఇంట్లో తల్లీకూతుళ్ల మధ్య మరోసారి గొడవ జరిగినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి బాలిక గొంతును రెండు చేతులతో నులిమినట్లు, దీంతో ఆమె మరణించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఘటనను ఆత్మహత్యగా చూపించేందుకు బాలిక మెడకు చీర కట్టి ఉరివేసుకున్నట్లుగా కనిపించేలా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఆ తర్వాత కూరగాయలు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లి, తిరిగి వచ్చాక కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కేకలు వేసినట్లు పోలీసులు తెలిపారు.
పోస్టుమార్టం నివేదికతో మలుపు.. తల్లి అరెస్ట్
కేసు దర్యాప్తులో సేకరించిన వైద్య నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు అనుమానితురాలిని విచారించారు. విచారణలో నిందితురాలు ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు చెందిన మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు అక్టోబర్ 29న విజయలక్ష్మిని అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయ రిమాండ్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. షాద్నగర్ జోన్ డీసీపీ సి. శిరీష రాఘవేంద్ర, షాద్నగర్ డివిజన్ ఏసీపీ పి. లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కొత్తూరు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు.