
కోర్టు వాయిదాలకు డుమ్మా.. నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్
వారెంట్ జారీ చేసిన ఖమ్మం రెండో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. అమలు చేసిన ఏన్కూరు పోలీసులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు అక్టోబర్ 31 2026: కోర్టు విచారణకు నిర్ణయించిన వాయిదాలకు హాజరుకాకపోవడంతో నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. దీంతో ఏన్కూరు పోలీసులు వారెంట్‌ను అమలు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ఆదేశాల మేరకు సబ్‌జైలుకు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఏన్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 19/2026 కింద బీఎన్ఎస్, పోక్సో చట్టం ప్రకారం నమోదైన కేసులో చల్లా ఎల్లయ్య (32) నిందితుడిగా ఉన్నాడు. విచారణకు సంబంధించి పలు వాయిదాలకు హాజరుకాకపోవడంతో అక్టోబర్ 30న ఖమ్మం రెండో ఫాస్ట్‌ట్రాక్ సెషన్స్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 31న పోలీసులు వారెంట్‌ను అమలు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరుకావాలని, న్యాయస్థానం ఆదేశాలను పాటించాలని కల్లూరు సబ్ డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ సూచించారు. మహిళలు, బాలికలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.