
చేవెళ్లలో ఫామ్ హౌస్ లో అమ్మాయిలతో విద్యార్థులు పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్ల: వీకెండ్ వచ్చిందంటే సరదాగా గడపాలని, ఫ్రెండ్స్ తో పార్టీలతో ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో ఫాంహౌస్ పార్టీలు కలకలం రేపుతుంటాయి. తాజాగా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిలతో బీబీఏ, బీటెక్ విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ సంచలనంగా మారింది. పోలీసులు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి వారికి షాకిచ్చారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మెట గ్రామం వద్ద ఉన్న ఎల్జీ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఒక పార్టీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), స్థానిక చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు.
పక్కా సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి ఫాంహౌస్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వగా.. వారిని చూసిన విద్యార్థిని విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడులతో నిర్వహకులు ప్లాన్ చేసిన ఫామ్‌హౌస్ పార్టీ కాస్తా భగ్నమైంది. సమాచారం ప్రకారం, ఈ పార్టీలో పాల్గొన్న వారంతా హైదరాబాద్‌లోని ప్రముఖ యూనివర్సిటీకి చెందిన బిబిఏ (BBA), ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
ఈ వేడుకలో మొత్తం 25 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. వారిలో దాదాపు 20 మంది వరకు విద్యార్థినులు, విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎల్జీ ఫాం హౌస్ నుంచి చేవెళ్ల పోలీసులు భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న విద్యార్థులకు మద్యం మాత్రమే కాకుండా డ్రగ్స్ అలవాటు ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అసలు పార్టీ కోసం ఈ ఫామ్‌హౌస్‌ను ఎవరు బుక్ చేశారు? కాలేజీ విద్యార్థులతో సీక్రెట్ గా పార్టీ నిర్వహించింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.