
మద్యం మత్తులో కాలేజీ వ్యాన్ డ్రైవింగ్.. బోల్తాపడి ఐదుగురు విద్యార్థులకు గాయాలు!
Web desc : ఇబ్రహీంపట్నం: విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన కాలేజీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మద్యం మత్తులో వాహనం నడపడమే కాకుండా, వ్యాన్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
సామర్థ్యానికి మించి విద్యార్థుల తరలింపు.. ఆదిబట్ల సీఐ ఎస్. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కోహెడ రోడ్డులోని శ్రీ గురు జూనియర్ కళాశాలలో కోహెడకు చెందిన ధనుష్ (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు.
కళాశాల వ్యాన్‌లో విద్యార్థులను తరలించే సమయంలో వాహన సామర్థ్యానికి మించి 15 నుంచి 18 మంది వరకు ఎక్కిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైవర్‌ను హెచ్చరించినా పట్టించుకోలేదు
ఈ నెల 2న సాయంత్రం 5 గంటల సమయంలో డ్రైవర్ ఫణి మద్యం మత్తులో వ్యాన్ నడుపుతూ తుర్కయంజాల్, బ్రాహ్మణపల్లి పరిధిలోని వేదికా రిసార్ట్ ఎదురుగా అదుపుతప్పి బోల్తాపడ్డాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న విషయాన్ని గమనించిన విద్యార్థులు ముందుగానే హెచ్చరించినప్పటికీ అతడు పట్టించుకోలేదని ఫిర్యాదుదారుడు తెలిపారు. ఐదుగురు విద్యార్థులకు గాయాలు..
ఈ ప్రమాదంలో ధనుష్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఘటనపై ధనుష్ సోదరుడు ఏ. సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతను పట్టించుకోని కళాశాల యాజమాన్యంతో పాటు మద్యం మత్తులో వ్యాన్ నడిపిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.