
రంగాపురం గ్రామంలో వరుస దొంగతనాలు…!
మొన్న రెండు ఇళ్లలో చోరీ…!
నిన్న రాత్రి తొమ్మిది ఇళ్లలో దొంగల హల్చల్..!
రంగంలోకి దిగిన పోలీసులు…
గ్రామంలో దొంగతనాల కలకలం..
పెబ్బేరు నవంబర్04 (సి కే న్యూస్)
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో దొంగలు హల్చల్ సృష్టించారు. గ్రామంలోని సుమారు తొమ్మిది ఇళ్లలో దొంగలు చొరబడి వస్తువులను చిందరవందర చేసినట్లు సమాచారం. అయితే చిన్నచిన్న వస్తువులు మినహా పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా తెలియరాలేదు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ ఓడీ రమేష్, పెబ్బేరు ఎస్ఐ వెంకటేష్ గౌడ్ గ్రామానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. దొంగతనాలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఒకేసారి తొమ్మిది ఇళ్లలో దొంగలు ప్రవేశించడంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఈ సందర్భంగా సీఐ ఓడీ రమేష్, ఎస్ఐ వెంకటేష్ గౌడ్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులు, నగదును భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఇంత జరుగుతున్నా పట్టించుకునేది ఎవరు..? గ్రామంలో తొమ్మిది ఇళ్లలో దొంగలు చొరబడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నప్పటికీ గ్రామ సర్పంచ్ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామ ప్రజల భద్రత, రక్షణ విషయంలో గ్రామ నాయకత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా గ్రామంలో భద్రతా చర్యలు చేపట్టి, రాత్రివేళల్లో నిఘా పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.