
ఒకే రోజు ఎమ్మెల్యేకు వరుసగా రెండు ప్రమాదాలు..
Web desc : నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు ఒకే రోజు వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు ఎదురయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న వాహనాలను వేర్వేరు సందర్భాల్లో ఇతర వాహనాలు ఢీకొట్టాయి. రెండు ప్రమాదాల్లోనూ ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడటంతో ఆయన అనుచరులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అన్నారం వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొట్టిన కారు.. వివరాల్లోకి వెళ్తే చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామానికి చెందిన ఓ కార్యకర్త కుటుంబంలో జరిగిన మరణం నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నుంచి ఇన్నోవా ఫార్చ్యూనర్ వాహనంలో బయలుదేరారు.
మార్గమధ్యంలోని కట్టంగూరు మండలం అన్నారం గ్రామం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కియా కారు వేగంగా వచ్చి ఎమ్మెల్యే వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు ముందుకు దూసుకెళ్లి పైలట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం ముందు, వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది.
మరో వాహనంలో వెళ్లిన ఎమ్మెల్యేకు రెండోసారి ప్రమాదం.. మొదటి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఎమ్మెల్యే మరో వాహనంలో చిట్యాల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భువనగిరి వైపు బయలుదేరిన సమయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి కూడా ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడిన ఎమ్మెల్యే మరో వాహనంలో తన పర్యటనను కొనసాగిస్తూ జనగామకు వెళ్లారు.
రెండు రోజుల వ్యవధిలో అన్నారం వద్ద మరో ప్రమాదం.. ఇద్దరు మృతి… కాగా, రెండు రోజుల క్రితమే ఇదే అన్నారం స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం గమనార్హం. తాజాగా ఎమ్మెల్యే వాహనం కూడా ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురికావడంతో అన్నారం స్టేజి వద్ద రోడ్డు భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
వరుస ప్రమాదాలతో ఈ ప్రాంత ప్రజలు, వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఒకే రోజు రెండు ప్రమాదాలు ఎదురైనా ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ఆయన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.