
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం… 14 మంది విద్యార్థుల సస్పెన్షన్
Web desc : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 14 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్ వాలియా సస్పెండ్ చేశారు.గత నెల 28వ తేదీన వసతి గృహంలో ఉంటూ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న సీనియర్ విద్యార్థులు అదే వసతి గృహంలో ఉన్న మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారు.
దీంతో జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ)కి మెయిల్ ద్వారా బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఎన్ఎంసీ సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించడంతో విచారణ జరిపిన కళాశాల ప్రిన్సిపాల్ వాలియా 14 మంది సీనియర్ విద్యార్థులను మంగళవారం రాత్రి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇందులో నలుగురికి ఆరు నెలలు, మరో 10 మందికి నాలుగు నెలల సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గతంలోనూ ఈ కళాశాలలో ఇదే తరహాలో ర్యాగింగ్ జరిగినా కళాశాల సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే నేరుగా ఎన్ఎంసీకి విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించి ఇన్చార్జ్ వార్డెన్, డిప్యూటీ వార్డెన్లు, కళాశాల సిబ్బంది పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఈ తరహా ర్యాగింగ్ జరిగిందని పలువురు విద్యార్థులు చర్చించుకుంటున్నారు.