
అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా మధిర రైల్వే స్టేషన్ రహదారులు
గుంతలమయంగా మారిన రోడ్లు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
ఫిర్యాదులు చేసినా స్పందించని మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు
మధిర నవంబర్ 06(సికె న్యూస్)
మధిర పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ రెండో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఎం సీనియర్ నాయకులు సాంబశివరావు విమర్శించారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ రహదారి పెద్దపెద్ద గుంతలతో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రెండో ప్లాట్‌ఫామ్ వైపు బ్రిడ్జి కింద నుంచి వెళ్లే రహదారితో పాటు, బ్రిడ్జిపై నుంచి మెయిన్ సెంటర్‌కు వచ్చే రోడ్డు సైతం ప్రయాణానికి నరకప్రాయంగా మారాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చినా, రాకపోయినా గుంతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్, స్థానిక వార్డు కౌన్సిలర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని సాంబశివరావు విమర్శించారు.
రహదారి ఆర్అండ్బీ పరిధిలోకి వస్తుందని, మున్సిపాలిటీ, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో పనులు చేపడతామని చెప్పి నెలలు గడుస్తున్నా మరమ్మతులు ప్రారంభించకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, సమన్వయంతో స్పందించి రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.