
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
Web desc : హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈగల్ ఫోర్స్ ఎస్టీఎఫ్ (STF), చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు 60 రోజుల నిరంతర వేట తర్వాత అంతర్రాష్ట్ర గంజాయి నెట్‌వర్క్‌ను ఛేదించారు.ఈ కేసులో కింగ్పిన్తో పాటు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 24.7 కిలోల గంజాయిని, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అసోంకు చెందిన భాస్కర్ హజారికా అనే నిందితుడు 2020 నుంచి ఒడిశా సరఫరాదారుల ద్వారా గంజాయిని తెప్పిస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో ఫుట్‌పాత్ హోటల్ నిర్వహిస్తూ, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ నెట్‌వర్క్‌ను నడిపాడు. గతంలోనూ మూడు కేసుల్లో పోలీసులకు చిక్కి బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ తన అక్రమ దందాను మాత్రం ఆపలేదు.
రూ.1.8 కోట్లకు పైగా వ్యాపారం : నిందితులు ఒడిశా నుంచి కిలో గంజాయిని రూ.12 వేల నుంచి రూ. 15 వేల ధరలికి కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత దానిని 150 చిన్న ప్యాకెట్లుగా విభజించి, ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 చొప్పున విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు.
గడచిన 10 నెలల్లో సుమారు 400 కిలోల గంజాయిని విక్రయించి రూ.1.8 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేవలం ఒక్క సరఫరాదారుడికే వివిధ విడతలుగా ఏకంగా రూ.48 లక్షలు బదిలీ చేసినట్లు నిందితుల బ్యాంకు లావాదేవీల ద్వారా అధికారులు గుర్తించారు.
పోలీసుల ఆపరేషన్, అరెస్ట్ : మొదట చౌటుప్పల్ పోలీసులకు చిక్కిన ఇద్దరు కొరియర్లను విచారించడంతో ఈ గ్యాంగ్ అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన ప్రత్యేక బృందాలు న్యూ హఫీజ్‌పేట్‌లోని భాస్కర్ ఇంటిపై మెరుపు దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
ఈ ఆపరేషన్‌లో కింగ్‌పిన్ భాస్కర్ హజారికాతో పాటు బాబు బోరా, నిర్మల్ హజారికా, ప్రంజల్ దత్తా, అకాన్ రాజ్‌బంశీలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




