
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.. పాతర్లపాడులో మాత్రం పూరిగుడిసెకు నిప్పంటుకుంటుందేమోనన్న భయం!
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో నిరుపేద కుటుంబం ఆవేదన
టపాసుల భయంతో తీవ్రమైన చలిలోనూ రాత్రంతా గుడిసెకు కాపలా కాస్తున్న తండ్రి
సెంటు భూమి కూడా లేని మాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు? అంటూ అల్లిక మునయ్య ప్రశ్న
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన అల్లిక మునయ్య కుటుంబం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో ప్రజలు దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంటే.. తమకు మాత్రం సొంత ఇల్లు లేక పూరిగుడిసెలోనే భయంభయంగా జీవించాల్సిన పరిస్థితి నెలకొందని బాధితుడు అల్లిక మునయ్య వాపోయారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు టపాసులు కాలుస్తుంటే ఎక్కడ ఆ నిప్పురవ్వలు తమ పూరిగుడిసెపై పడి ఇల్లు కాలిపోతుందోనన్న భయంతో తన తండ్రి తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రాత్రంతా నిద్రపోకుండా గుడిసెకు కాపలా కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని కన్నీటిపర్యంతమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు కనిపిస్తుంటే.. తమ ఇంట్లో మాత్రం గుడిసెకు నిప్పంటుకుంటుందేమోనన్న ఆందోళనతో పండుగను సైతం ప్రశాంతంగా జరుపుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందన్న ఆశతో తమ కుటుంబం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలిపారు. మొదటి విడతలోనే తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని భావించామని, అయితే జాబితాలో తమ పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు.
సెంటు భూమి కూడా లేని మేము అనర్హులమా?
తమకు కనీసం సెంటు భూమి కూడా లేదని, సొంత ఇల్లు కూడా లేని తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు కాలేదని అల్లిక మునయ్య ప్రశ్నించారు. మరోవైపు వ్యవసాయ భూములు ఉన్నవారికి, ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వారికి ఇళ్లు మంజూరు కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తమలాంటి నిరుపేద కుటుంబాలను కూడా అధికారులు గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు జరుగుతుంటే.. మరోవైపు పాతర్లపాడు గ్రామంలో తమలాంటి నిరుపేద కుటుంబం పూరిగుడిసెలోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తమ కుటుంబ పరిస్థితిని పరిశీలించి, అర్హతను పరిగణనలోకి తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు అల్లిక మునయ్య ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకున్నారు.