
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Web desc : ఎన్టీఆర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జి.కొండూరు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి, రూ.10 వేల లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జి.కొండూరు మండలానికి చెందిన ఓ రైతుకు భూమికి సంబంధించిన పాస్‌బుక్ అందించాల్సి ఉంది. ఈ పని పూర్తి చేసి పాస్‌బుక్ జారీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో లంచం ఇచ్చేందుకు ఇష్టపడని బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కార్యాలయంలో నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో విజయ్ కుమార్ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు చేసేందుకు లంచాలు డిమాండ్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.