
526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వచ్చే నెల్లోనే నోటిఫికేషన్!
Social media : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం.ఈ పోస్టులకు డిసెంబర్ 1, 2026 నాటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మొత్తం 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో 429 రెగ్యులర్ పోస్టులు ఉండగా, మరో 97 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరతను తగ్గించడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ… ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తున్న షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు గుర్తించనున్నారు. అభ్యర్థుల ఎంపికలో డెమో క్లాస్, ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హతలు, నిబంధనల ప్రకారం అభ్యర్థులను పరిశీలించి తుది ఎంపిక చేపట్టనున్నారు.
ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత 2027 ఏప్రిల్ నాటికి అర్హులైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.ఈ నియామకాల్లో ఉస్మానియా యూనివర్సిటీ (OU)లో అత్యధికంగా 281 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. దీంతో OUలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయి.
526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై ఉన్నత విద్యారంగంలో ఆసక్తి నెలకొంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక నిబంధనలపై పూర్తి స్పష్టత రానుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం సంబంధిత విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ప్రకటనలను గమనిస్తూ ఉండాలి.